- ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కులవృత్తులు, చేతి వృత్తులకు వరంలాంటిదని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం పీఏం విశ్వకర్మ మొదటి విడత వేడుకలు ఉట్నూర్ లోని కేబీ కాంప్లెక్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్ధా, మహారాష్ట్ర నుంచి వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆర్డీఎస్డీ జాయింట్ డైరెక్టర్ విద్యానంద్, వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు, ఉట్నూర్ ఐటీఐ ప్రిన్సిపల్ రొడ్డ శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేది నుంచి 10 వ తేదీ వరకు మొదటి విడత శిక్షణ పొందిన 21 మంది వృత్తి కళాకారులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ కు తమ నైపుణ్యం తో మెరుగులు దిద్ది ఉపయోగంలోకి తెచ్చారని అభినందించారు. గత ఏడాది సెప్టెంబర్ 17 న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించారని, 18 రకాల సంప్రదాయ చేతి వృత్తులు వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.
చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల నాణ్యతను పెంచి, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్ తో అనుసంధానం చేయడమే స్కీమ్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని
కోరారు.