గత BRS ప్రభుత్వంలా కాదు.. అధికారులపై ఎంపీ గడ్డం వంశీ సీరియస్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క దిశ మీటింగ్ నిర్వహించలేదని.. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడి నిర్లక్ష్యానికి గురైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. 2024, నవంబర్ 14న పెద్దపల్లి కలెక్టరేట్‎లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ మీటింగ్‎లో ఎంపీ గడ్డం వంశీ పాల్గొన్నారు. ఈ దిశ మీటింగ్ లో అధికారులపై ఎంపీ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అధికారుల దగ్గర సరైన వివరాలు లేకపోవడం.. అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎంపీ సీరియస్ అయ్యారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం నాణ్యత పెంచాలని.. తరచూ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

 రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని.. హెల్త్ సబ్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా నుంచి కరీంనగర్, హైదరాబాద్‎కు రిఫరల్ కేసులో తగ్గించాలని ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు చాలా ఉన్నాయని.. అధికారులు స్పందించి పవర్ కట్స్ లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని.. కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దిశ మీటింగ్‎లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయనే విషయాలపై అధికారులతో డిస్కస్ చేశామని తెలిపారు. 

ఇంతకుముందు ప్రభుత్వంలా కాదని.. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ మీటింగ్ నిర్వహించి పథకాల అమలు తీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధ్యే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. 35 ఏండ్ల క్రితం కాకా వెంకటస్వామి పెద్దపల్లి ప్రాంతానికి మొదటి సారిగా ఎంపీ అయ్యారని.. ఈ ఏడాది పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపారని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పని చేయాలని సూచించారు.