గ్రీవెన్స్​లో భూ సమస్యలపై ఫిర్యాదులు

మంచిర్యాల/ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మంచిర్యాల కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​లో భూ సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి ధరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల రాంనగర్ కు చెందిన బొమ్మకంటి శ్రీనివాస్ తనకు మంచిర్యాల శివారులోని భూమికి సంబంధించి ధరణిలో పట్టాదారుగా నమోదు చేసి పాస్ బుక్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు.

దండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన జాడి కల్యాణ్ చక్రవర్తి తమకు లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామ శివారులో వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు ఆక్రమించుకొని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అసలైనవిగా చలామణి చేస్తున్నారని, ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించాడు. వీటితోపాటు పలు అర్జీలను అధికారులు స్వీకరించారు.

ఉద్యోగంలోంచి తొలగించారని బోరుమన్న మహిళ

ఆదిలాబాద్​కలెక్టరేట్ నిర్వహించిన గ్రీవెన్స్​లో ఓ మహిళ తనను ఉద్యోగంలోంచి తొలగించారంటూ కన్నీరు పెట్టుకుంది. మొత్తం 104  మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు చేసుకోగా కలెక్టర్ రాజర్షి షా స్వీకరించారు. అయితే ఓ మహిళ కలెక్టర్​కు తన గోడు వెళ్లబోసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంధికి చెందిన అనిత స్థానిక టీజీబీ బ్యాంక్ మిత్రగా పదేండ్ల నుంచి పనిచేస్తోంది. అయితే ఐకేపీ, బ్యాంకు సిబ్బంది గత 9 నెలలుగా జీతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అంతేకాకుండా ఉద్యోగంలో నుంచి తీసేశారంటూ కన్నీరుపెట్టు కుంది. తనకు న్యాయం చేయాలని కలెక్టర్​ను కలిసి వినతి పత్రం అందజేసింది.

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణిలోఆర్డీవో లోకేశ్వరరావు తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. దహేగాం మండల కేంద్రానికి చెందిన ఎరుగంటి చంద్రయ్య మండలంలో అనర్హులకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపచేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. రెబ్బెన మండలం వంకులం గ్రామస్తులు రాళ్లపేట గ్రామపంచా యతీ నుండి విడదీసి నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

పెంచికల్ పేట మండలం గుండేపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో 100 శాతం గిరిజనులు నివసిస్తున్నారని, కమ్మర్ గాం పంచాయతీ నుంచి తొలగించి నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ దర ఖాస్తు అందజేశారు. వీటితోపాటు పలు దరఖాస్తులను కలెక్టర్​ స్వీకరించారు.