పీడీపీఎస్​ను రద్దు చేయాలి : మోర్తాల చంద్రరావు

ఆదిలాబాద్, వెలుగు: నీతి అయోగ్ సూచన చేసిందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పీడీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చంద్రరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం సీసీఐ రైతుల పత్తి పంటను కొనుగోలు చేసి చెల్లిస్తున్న ఎమ్మెస్పీ విధానాన్ని ఎత్తేయాలని చూస్తోందన్నారు.

వ్యవసాయ మార్కెట్లలో రైతుల పత్తి పంటలకు నిర్ణయించిన ధరల ప్రకారం ప్రైవేటు వ్యాపారులకే విక్రయించి.. ఎమ్మెస్పీకి, ప్రైవేటు వ్యాపారుల ధరలకు మధ్య ఉన్న వ్యత్యాస ధరను 15 శాతం మించకుండా 15 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి సీసీఐ జమ చేస్తుందని చెప్పడం చట్టబద్ధత లేని పథకమేనన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు జెండా రమేశ్, బి.నర్సయ్య, తిరుపతి, తాటికొండ రవి, జిల్లా నాయకులు నగేశ్, అల్తాఫ్ పాల్గొన్నారు.