చివరి దాకా బీజేపీలోనే ఉంటా..వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా :  మోహన్ రావు పటేల్

  • నాపై అసత్య ప్రచారాలు మానుకోవాలి: మోహన్ రావు పటేల్

బైంసా, వెలుగు: ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ స్పష్టం చేశారు. పార్టీ మారనున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గురువారం భైంసా పట్టణంలోని దారాబ్జి జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఒక వర్గం తమ రాజకీయ లబ్ధి కోసం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతానన్నారు.  తాను ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని, పల్లె పల్లెకు బీజేపీ.. గడప గడపకు మోహన్ రావ్ పటేల్ కార్యక్రమం ద్వారా ముథోల్ నియోజకవర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లానని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తే లేదన్నారు. రాబోయే రోజుల్లో నియోజక వర్గం నుంచి పోటీలో ఉంటానని, తాను పదవిలో లేకపోయినా మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు.