ప్రమోషన్‌‌‌‌ రాదు.. ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కాదు

  • 11 ఏండ్లుగా ఒకే చోట, ఒకే డ్యూటీ చేస్తున్న మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్లు
  • రాష్ట్ర వ్యాప్తంగా 194 స్కూళ్లలో 3 వేల మంది ఉపాధ్యాయులు
  • సాధారణ బదిలీల్లో అవకాశం ఇవ్వాలంటున్న ఉద్యోగులు
  • కోర్టు కేసుతో ఆగిన ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌
  • సర్వీస్‌‌‌‌లో మరణించినా కుటుంబాలకు అందని పరిహారం


ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల ఉద్యోగులు, టీచర్లు ఓ చోటు నుంచి మరోచోటుకు వెళ్లారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌లో పనిచేస్తున్న టీచర్లు మాత్రం ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్లకు నోచుకోవడం లేదు. మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్లను ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేస్తామని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం గతంలో పలుమార్లు ప్రకటించినా ఆచరణలో పెట్టలేదు.

దీంతో పదకొండేళ్లుగా ఎక్కడివారు అక్కడే పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వమైనా స్పందించి తమకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌‌‌లోని ఇందిరా పార్క్‌‌‌‌ వద్ద నిరసన దీక్ష సైతం చేపట్టారు.

11 ఏళ్లుగా ఒకే చోట డ్యూటీ

జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2013– -14 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 100 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌‌‌‌లో ఒక్కో గ్రూపులో 40 మంది స్టూడెంట్లకు అవకాశం కల్పించారు. మొత్తం స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి వరకు 80 వేల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. మొత్తం 3,880 టీచింగ్ పోస్టులు మంజూరు చేసింది. 194 స్కూళ్లలో 100 మంది రెగ్యులర్ ప్రిన్సిపాల్స్‌‌‌‌ ఉండగా 94 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పీజీటీ టీచర్లు ఇన్‌‌‌‌చార్జి ప్రిన్సిపాల్స్‌‌‌‌గా కొనసాగుతున్నారు.

అలాగే పీజీటీ పోస్టులు 2,522 మంజూరు కాగా 1,970 మంది, టీజీటీ పోస్టులు 1,164 మంజూరు కాగా 757 మంది పనిచేస్తున్నారు. వీరంతా 11 ఏళ్లుగా ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్లు లేకుండా ఒకే చోట పనిచేస్తున్నారు. మోడల్ స్కూల్‌‌‌‌ టీచర్లు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పనిచేస్తుండడంతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. అర్హత ఉన్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఏండ్ల తరబడి టీజీటీలు, పీజీటీలుగానే పనిచేస్తున్నారు.

కోర్టు కేసుతో నిలిచిన ప్రక్రియ

2023 జూలైలో అప్పటి ప్రభుత్వం మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్ల బదిలీల కోసం షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసి వెబ్‌‌‌‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది. కానీ కొందరు టీచర్లు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌‌‌‌ పడింది. మొదటి విడతలో భాగంగా 2013లో ఆరు నుంచి ఎనిమిది, ఇంటర్ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ తరగతులు ప్రారంభం అయ్యాయి. 2014లో రెండో విడతలో భాగంగా 9,12 తరగతి విద్యార్థుల బోధన కోసం టీచర్లను తీసుకున్నారు. అయితే తమకు కూడా మొదటి విడతలో ఎంపికైన టీచర్లతో సమానంగా నోషనల్‌‌‌‌ పాయింట్లు ఇచ్చి ట్రాన్స్‌‌‌‌ఫర్లు చేయాలని రెండో విడతలో ఎంపికైన టీచర్లు హైకోర్టుకు వెళ్లారు.

రెండు నెలల కింద వాదనలు పూర్తి అయినా ఇంకా తీర్పు వెలువడలేదు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల బదిలీలు జరగడంతో మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్లలో సైతం ఆశలు చిగురించాయి. 2013లో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసే టైంలో ప్రిన్సిపాల్‌‌‌‌ పోస్టులు స్టేట్‌‌‌‌ కేడర్‌‌‌‌లో, పీజీటీ, టీజీటీ పోస్టులు జోన్‌‌‌‌ కేడర్‌‌‌‌లో ఉండేవి. ప్రస్తుతం ఉద్యోగుల కేడర్‌‌‌‌ను జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లుగా విభజించారు. ఈ క్రమంలో జీవో నెంబర్ 317 ప్రకారం మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది.

పరిహారం లేదు.. కారుణ్య నియామకాలు లేవు..

సర్వీస్‌‌‌‌లో ఉండగా ఎవరైనా ఉద్యోగి చనిపోతే అతడి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద బోధనేతర కొలువులు ఇవ్వాలన్న నిబంధనలు వర్తించడం లేదని పలువురు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్లు వివిధ కారణాలతో చనిపోయారు. వీరి కుటుంబాలకు కనీసం పరిహారం కూడా అందలేదు. మెడికల్ రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ సదుపాయం కల్పించడం లేదని, హెల్త్‌‌‌‌ కార్డులు జారీ చేయడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

అలాగే ఇంటర్‌‌‌‌ క్లాస్‌‌‌‌లు చెబుతున్న పీజీటీలకు జేఎల్‌‌‌‌గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులను భర్తీ చేయాలని పలువురు టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ పోస్టులను సైతం డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని కోరుతున్నారు.

బదిలీలపై ప్రభుత్వం చొరవ చూపాలి

రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో బదిలీలు జరుగుతున్నాయి. మోడల్ స్కూల్‌‌‌‌ టీచర్లు, ప్రిన్సిపాళ్లు 11 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కావడం లేదు. కుటుంబాలకు దూరంగా ఉండడమే కాకుండా అర్హత ఉన్నా ప్రమోషన్లు దక్కకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే 34 మంది టీచర్లు సర్వీస్‌‌‌‌లో ఉండగానే చనిపోయారు.వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం చొరవ చూపి కేసు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, న్యాయం చేయాలి.

– మాదాపురం ఉమేశ్‌‌‌‌రావు, టీఎంఎస్టీఏ ఉపాధ్యక్షుడు, బోథ్ స్కూల్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌