- 76.13 శాతం పోలింగ్ నమోదు
- కొమురవెల్లిలో అత్యధికంగా 86.58 శాతం
- బ్యాలెట్ సైజుతో పోలింగ్ ఆలస్యం
సిద్దిపేట/కొమురవెల్లి,వెలుగు : నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం జరిగిన పోలింగ్ సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 5 పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4 మండలాల పరిధిలో మొత్తం 4679 ఓటర్లకు గాను 3562 మంది ఓటు వేశారు. మొత్తం 76.13 శాతం పోలింగ్ నమోదు కాగా కొమురవెల్లి పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా86.58 శాతం, అత్యల్పంగా చేర్యాల లో 76.62 శాతం పోలింగ్ జరిగింది.
ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా కొంత మందకొడిగానే సాగినా మధ్యాహ్నానికి పుంజుకుంది. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మను చౌదరి, సీపీ అనురాధతో పాటు, ఏసీపీ సతీశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచినా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా నలుగురైదుగురికి మించి పోలింగ్ ఎజెంట్లు కనిపించలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సెల్ ఫోన్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ సైజు తో పోలింగ్ ఆలస్యం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 52 మంది పోటీ చేస్తుండడంతో బ్యాలెట్ సైజు పోలింగ్ నిర్వహణకు అధిక సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఒక్కో ఓటు వేయడానికి నిమిషాల వ్యవధి పట్టడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి రావడంతో భారీ సైజ్ బ్యాలెట్లో ఓటర్లు అభ్యర్థులను వెతుక్కోవడానికి మరింత సమయం పట్టిందని ఓటర్లు వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ భారీ సైజులో ఉండడంతో కొందరు ఓటర్లు తికమక పడగా, బ్యాలెట్ పేపర్నిచింపి మడతపెట్టి ఇవ్వడానికి టైం పడుతున్నట్లు సిబ్బంది చెప్పారు.
ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ను ప్రత్యేకంగా మడత పెట్టి బ్యాలెట్ బాక్స్ లో వేయాలని ఓటర్లకు సిబ్బంది సూచించడం కనిపించింది. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం వేళల్లో స్థానికులు ఓటు హక్కును వినియోగించుకోగా మధ్యాహ్నం ఇతర ప్రాంతాల్లో నివాసముటున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు దారులు ఓటర్లను అభ్యర్థించడం కనిపించింది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చేర్యాలలోని పోలింగ్ సెంటర్లను సందర్శించిన అనంతరం బయట బీజేపీ నేతలతో ముచ్చటించారు. కొందరు వికలాంగులు వీల్ చైర్లు, సహాయకుల తో వచ్చి ఓట్లు వేశారు.
తగ్గిన పోలింగ్ శాతం
చేర్యాల లోని 2 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ముగిసే సమయానికి దాదాపు వంద మంది ఓటర్లు క్యూలైన్ల లో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ముగియగానే పోలింగ్ కేంద్రాల గేట్లను మూసి వేశారు. అప్పటికే క్యూలైన్ల లో ఉన్న వంద మంది ఓటర్లు 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడేండ్ల కింద జరిగిన పోలింగ్ తో పోలిస్తే బై ఎలక్షన్ పోలింగ్ శాతం తగ్గింది. వేసవి ఎండలకు తోడు బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం పెద్దగా ఓటర్లను రప్పించడానికి ప్రయత్నాలు చేయలేదు. 2021 లో జరిగిన ఎన్నికల్లో 82.28 శాతం పోలింగ్ నమోదు కాగా ప్రస్తుతం 76.13 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 6.15 శాతం పోలింగ్ తగ్గింది.