ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదలపై సర్కారుతో చర్చిస్తా..

  • ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం

నిర్మల్, వెలుగు :  ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదలపై ప్రభుత్వంతో చర్చిస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు, మండల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రజాగళం పేరిట ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా ఉంటానన్నారు.  రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను వివరిద్దామని పేర్కొన్నారు.  పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ.. వందల మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే, రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఆంధ్ర పెట్టుబడిదారులు పరిశ్రమల పేరిట రైతులను ఇబ్బందులకు  గురి చేస్తున్నారని ఆరోపించారు.  ఇథనాల్ కు బదులు సోలార్ విద్యుత్ ఇంధనాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభలో టీపీ జేఏసీ కో కన్వీనర్ రవి స్థానిక నేతలు పాల్గొన్నారు.