చెన్నూరు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

  • త్వరలో భీమారం, చెన్నూర్​కు అంబులెన్స్ సర్వీసులు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • గాంధారి వనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతా
  • సెగ్మెంట్​లో 500 కోట్లతో పనులు
  • 2 అంబులెన్స్ సర్వీసులు, ఆర్వోబీపై సెంట్రల్​ లైటింగ్​ప్రారంభం 

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు : చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు అంబులెన్స్​ సర్వీసులను, మందమర్రి రామన్​కాలనీ వద్ద  రైల్వే ఆర్వోబీపై రూ.40 లక్షలతో  ఏర్పాటు చేసిన సెంట్రల్​ లైటింగ్​ సిస్టంను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్​పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రోడ్లు, డ్రైయినేజీలు, డ్రింకింగ్​ వాటర్, వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆరోపించారు. చెన్నూరు ఆస్పత్రిలో సీఎస్​ఆర్​ ఫండ్స్ తో కొత్తగా రెండు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించినట్టు చెప్పారు. వీటివల్ల కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.

15 రోజుల కిందట ‘వెలుగు’ పత్రికలో అంబులెన్స్​ లేదన్నవార్త రావడంతో కోటపల్లి మండలానికి కొత్త అంబులెన్స్​ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో చెన్నూరు, భీమారంలో  రెండు 108 అంబులెన్స్​ సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. 108 కింద పాత వాహనాల స్థానంలో వచ్చెనెలలో వాటిని తీసుకవచ్చేందుకు సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారని చెప్పారు.  మంచి కండిషన్ లో ఉన్న  పాత అంబులెన్స్​ల  రిపేర్లకు ఫండ్స్​కేటాయిస్తామన్నారు. మందమర్రిలో 108,102 అంబులెన్స్​ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే మరిన్ని వెహికల్స్​అందుబాటులోకి తెస్తామన్నారు.

500 కోట్లతో అభివృద్ధి పనులు..

చెన్నూరు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు. 2025 నాటికి  చెన్నూరు రూపురేఖలు మారుతాయన్నారు. అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇండ్లను అందించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలు చేసేందుకు సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మందమర్రి ప్రజలకు దీపావళి కానుకగా ఆర్వోబీపై సెంట్రల్​ లైటింగ్​ సిస్టం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టణాల్లో అవసరమైన చోట సెంట్రల్​ లైటింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని, అన్ని ప్రాంతాల్లో  సీసీ రోడ్లు, సైడ్​ డ్రైయినేజీలు నిర్మిస్తామని అన్నారు. 

పర్యాటక ప్రాంతంగా గాంధారివనం

గాంధారివనం అర్బన్​ పార్కును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారివనం ఎకో పార్కును మంచిర్యాల డీఎఫ్​వో శివ్​ ఆశీష్​ సింగ్​తో కలిసి సందర్శించారు. ఈ వనాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలో రోల్​ మోడల్​గా మారుస్తామన్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధారివనంను సందర్శించినప్పుడు వాకర్స్​ తన దృష్టికి పలు సమస్యలు తెచ్చారని, వారి కోరిక మేరకు ఓపెన్​ జిమ్, రామకృష్ణాపూర్ టౌన్​ వైపు​ నుంచి గాంధారివనంలోకి వచ్చేందుకు  కొత్తగా రింగ్​గేటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్​ చైర్​ పర్సన్లు జంగం కళ, అర్చన గిల్డా, ఎఫ్​ఆర్​​వో రత్నాకర్​రావు, ఎఫ్​ఎస్​ఓ పోశెట్టి, ఆర్​ అండ్ బీ డీఈ రమేశ్, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు. 

గోల్డెన్ ​జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే

క్యాతనపల్లి మున్సిపాలిటీ కొత్త తిమ్మాపూర్​షేడ్​కేంద్రంలో గురువారం నిర్వహించిన ఫాదర్​థామస్​నిలియాని గోల్డెన్​ జూబ్లీ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు. 50 ఏండ్లుగా ఫాదర్​ థామస్​ నిలియాని అందించిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన సేవలపై సీనియర్​ జర్నలిస్ట్ ఎండీ మునీర్ రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, క్రైస్తవ మత గురువులు పాల్గొన్నారు.  

దివాళి వేడుకల్లో కోల తిప్పిన ఎమ్మెల్యే

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంప్రదాయబద్ధంగా కోల తిప్పారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. గురువారం ఉదయం చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే మార్నింగ్​ వాక్​ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.