ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన రోడ్డు కష్టాలు

చెన్నూర్, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి చొరవతో చెన్నూర్ మండలంలోని రాయపేట గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీరాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బురదమయమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే వివేక్​ దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం తాత్కాలికంగా కంకర చిప్స్ వేయటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఎన్నో ఏండ్లుగా రోడ్డు సౌకర్యం లేదని, ఈ విషయాన్ని అనేకసార్లు గత ప్రభుత్వ పాలకులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. 

ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సమస్య చెప్పుకోగా రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ నెరవేర్చుతూ చిప్స్ కంకర పోసి తాత్కాలికంగా గ్రామంలో రోడ్డు వేశారని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత హేమవంతరెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ప్రజల సమస్యలు తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు.