గత బీఆర్ఎస్ పాలనలో ఖజానా ఖాళీ అయ్యిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్యాతన పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన..గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లుగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒత్తిడి వస్తున్నప్పటికీ ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో వరద కాలువలు సిసి రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. రెండు రోజుల్లో మూడు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని చెప్పారు. మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్నికల ప్రచారానికి ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేశారని.. నిధులు కూడా ఆగిపోయాయని తెలిపారు. 4 నెలలు ఎన్నికల కోడ్ తో అభివృద్ధి పనులు నిలిచి పోయినప్పటికీ తాను నియోజకవర్గంలోని పట్టణాలు గ్రామాలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నాని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.