- పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- గత బీఆర్ఎస్ సర్కార్అభివృద్ధిని పట్టించుకోలే
- రైల్వే సేవలు మెరుగుపర్చేందుకు ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తున్నరు
- మంచిర్యాలలో వందేభారత్ హాల్టింగ్‌కు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
- మందమర్రి మున్సిపల్ వార్డుల్లో చెన్నూర్ ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ను సంక్రాంతికి ప్రారంభిస్తామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం, క్యాతనపల్లిలో రెండు రైల్వే ఫ్లై ఓవర్ లను మంజూరు చేశానని చెప్పారు. రూ.30 కోట్లతో రామగుండం బ్రిడ్జిని పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 11 ఏండ్లుగా క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాలేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలకులే దీనికి కారణమని మండిపడ్డారు.
క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో బుధవారం వివేక్ పర్యటించారు. రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంక్రాంతిలోపు ఎట్టిపరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ కంప్లీట్ అయితే ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఉండదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకున్న.
ఎంపీగా ఉన్నప్పుడు రామకృష్ణాపూర్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ ఇప్పించిన. నాగ్‌పూర్–హైదరాబాద్ మధ్య వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్, కాగజ్‌నగర్ – తిరుపతి మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విన్నవించారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని రైల్వే స్టేషన్లలో సౌలత్లు, హాల్టింగ్ కల్పించేందుకు వంశీకృష్ణ కృషి చేస్తున్నరు’’అని వివేక్ తెలిపారు.
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తున్నం
మందమర్రి మున్సిపాలిటీలోని శ్రీపతినగర్, దీపక్ నగర్ లో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేక ప్రజలెంతో ఇబ్బందిపడ్డారని వివేక్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాగునీరు, స్ట్రీట్ లైటింగ్, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరారు. రూ.79 లక్షలతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కాలనీవాసుల పదేండ్ల కల నెరవేరబోతున్నది. మందమర్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.
ఎలాంటి జాప్యం చేయొద్దు. సింగరేణి కార్మికవాడల్లో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణలో సింగరేణి అధికారులు దృష్టిపెట్టాలి’’అని అధికారులకు వివేక్ సూచించారు. మందమర్రి ఓల్డ్ బస్టాండ్, విద్యానగర్, దీపక్‌నగర్ ఏరియాల్లో బుధవారం మార్నింగ్ వాక్ చేశారు. ఇటీవల ప్రారంభించిన రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. షాదిఖానా కోసం స్థలాన్ని పరిశీలించారు. వివేక్ వెంట మందమర్రి ఎమ్మార్వో సతీశ్ కుమార్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, గద్దె రాజు, ఆర్ అండ్ బీ డీఈ రమేశ్, మంద్రమర్రి ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మందమర్రి, రామకృష్ణాపూర్లో ఇటీవల వివిధ కారణాలతో చనిపోయిన నెరువెట్ల లక్ష్మయ్య, ఆడెపు రాయమల్లు, రిపోర్టర్ గట్టయ్య తల్లి కొడూరి లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్ పనాస రాజయ్య అత్త పేరం యశోద, మీసా రాజమల్లమ్మ కుటుంబ సభ్యులను వివేక్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రిపోర్టర్ కుమార్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, మందమర్రి, రామకృష్ణాపూర్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్లు నోముల ఉపేందర్‌గౌడ్, పల్లె రాజు, పార్టీ నేతలు పాల్గొన్నారు.