మిషన్ భగీరథ.. పెద్ద అవినీతి స్కీమ్

  • -కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు కేసీఆర్ ఈ పథకం తెచ్చిండు: వివేక్‌‌ వెంకటస్వామి
  • -ప్రజలు మురికి నీళ్లు తాగే దుస్థితికి కారణం మాజీ సీఎంయే
  • -రూ.30 కోట్లతో మందమర్రిలో కొత్త వాటర్ స్కీం తీసుకొస్తా
  • మందమర్రి మున్సిపాలిటీలో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: మిషన్ భగీరథ అదో పెద్ద అవినీతి స్కీమ్‌‌ అని, పదేండ్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఈ పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ అమలు చేసిండని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని కేకే ఓసీపీ ఏరియా, యాపల్, అబ్రహాం నగర్, సింగరేణి జీఎం ఆఫీస్ ప్రాంతాల్లో నిర్వహించిన మార్నింగ్ వాక్‌‌లో వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సింగరేణి జీఎం ఆఫీస్ ఏరియాలోని స్థానికులు తమకు మిషన్ భగీరథ ద్వారా మురికి, వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయని, బాటిల్స్‌‌లో పట్టిన నీటిని ఎమ్మెల్యేకు చూపించారు. ఈ సమస్యను గత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఒక పెద్ద అవినీతి స్కీమ్ అని మొదటి నుంచి తాను చెబుతున్నానని, ఎక్కడా నీళ్లు సరిగా రావడం లేదన్నారు.

వచ్చే కొద్దిపాటి నీళ్లు మురికి, వాసనతో ఉంటున్నాయని, వీటిని ప్రజలు ఎలా తాగుతారని ప్రశ్నించారు. మందమర్రి ప్రజల తాగునీటి కష్టాలు దూరం చేసేందుకు రూ.30 కోట్లతో కొత్త వాటర్ స్కీంను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌ స్కీంను మరింత మెరుగుపరుస్తూ అమలు చేస్తామని, అమృత్ స్కీం కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ స్కీం పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు.

పదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు..

మందమర్రి మున్సిపాలిటీలో గత పదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సైడ్ డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సౌలతులు లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రత్యేక ఫండ్స్ కేటాయించి సైడ్ డ్రైన్స్, రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి జీఎం ఆఫీస్ ఏరియా అంగడి బజార్‌‌‌‌లోని పల్లె దవాఖానలో మందుల కొరత, డాక్టర్లు రావడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా, వైద్యాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.

కేకే ఓసీపీ ఏరియాలోని కాలనీలో డీఎంఎఫ్‌‌టీ ఫండ్స్‌‌తో సులభ్‌‌​కాంప్లెక్స్, బస్టాఫ్​ నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. కాలనీల్లో పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నామని, జీఎం ఆఫీస్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరగా, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం దేవేందర్‌‌‌‌తో ఎమ్మెల్యే వివేక్‌‌ ఫోన్‌‌లో మాట్లాడి..

కమ్యూనిటీ హాల్ నిర్మాణం, పందుల సమస్యను తీర్చాలని ఆదేశించారు. యాపల్ శ్రీకోదండ రామాలయం పునర్నిర్మాణానికి మంజూరైన రూ.40 లక్షలను ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతున్న మందమర్రి పాత బస్టాండ్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ సీనియర్​లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్‌‌ను వివేక్ పరామర్శించారు.

మాచన్​పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. 

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మాచన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే సమాజంలో అన్ని వర్గాలకూ గౌరవం దక్కుతున్నదని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ‘‘అంబేద్కర్ మహోన్నత వ్యక్తి. ఆయన రచించిన రాజ్యాంగంతోనే నేడు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి.

అంబేద్కర్ వల్లే మహిళలకు రిజర్వేషన్లు దక్కాయి. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రజినీ సాయిచంద్, వెన్నెల గద్దర్, బేగరి రాజు తదితరులు పాల్గొన్నారు.

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం

జగిత్యాల/ కోరుట్ల, వెలుగు: రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని నిరూపించుకున్నామని ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. అర్హులైన రైతులకు రుణ మాఫీ చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ పని చేస్తుందని చెప్పారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో మండల వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్‌‌గా పన్నాల అంజిరెడ్డి, వైస్ చైర్మన్‌‌గా వెంకటేశ్‌‌తో పాటు పలువురు డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని నమ్మిన ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్​రావు ప్రోత్సాహంతో గతంలో ఎంపీగా గెలిచానని చెప్పారు.

జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపరింగ్ చేయడంవల్ల ఓడిపోయాను కానీ ప్రజల మనసులో ఓడిపోలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, అన్నం అనిల్, వెంకటేశ్‌‌ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.