చెన్నూర్‌‌లో రూ. 30 కోట్లతో అమృత్​ స్కీమ్​: ఎమ్మెల్యే వివేక్

  • ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తం
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు : చెన్నూర్‌‌లో మంచినీటి సమస్యను తీర్చేందుకు రూ.30 కోట్లతో అమృత్‌‌ స్కీమ్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి చెప్పారు. పదేండ్లు పాలించిన బీఆర్‌‌ఎస్‌‌ ప్రజలకు కనీస సౌలత్‌‌లు కూడా కల్పించలేదన్నారు. బుధవారం చెన్నూర్, జైపూర్, మందమర్రి మండలాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని వార్డుల్లో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేవని, తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

గత నెల బేతాలవాడ, మారెమ్మవాడలో మార్నింగ్‌‌ వాక్‌‌ సందర్భంగా స్థానికులు తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి రూ.6.50 కోట్లు మంజూరు చేశామని, 15 రోజుల్లో పనులు చేపట్టేందుకు ఆఫీసర్లను ఆదేశించినట్లు చెప్పారు. ఏడాదిలోపు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. రుణమాఫీ కాని వారి లిస్ట్‌‌ను రెడీ చేయాలని కాంగ్రెస్‌‌ లీడర్లకు సూచించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.