సుప్రీం తీర్పు మాలలను ఏకం చేసింది : వివేక్ వెంకటస్వామి

  • సింహగర్జన సభతో దేశం మొత్తం మనవైపు చూసింది: వివేక్ వెంకటస్వామి
  • మాల జాతి బలహీనం కావొద్దు.. అవసరమైతే త్యాగాలకురెడీ కావాలని పిలుపు
  • నిజామాబాద్‌‌, ఆదిలాబాద్​లో మాలల భవిష్యత్ కార్యాచరణ సన్నాహక మీటింగ్​

​నిజామాబాద్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని పరేడ్‌‌ గ్రౌండ్స్‌‌లో డిసెంబర్ 1న నిర్వహించిన మాలల సింహగర్జన దేశంలోని అన్ని కులాలు ఇటువైపు చూసేలా చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఒక కులం ఆధ్వర్యంలో ఈ స్థాయిలో మీటింగా? అని అంతా ఆశ్చర్యపోయారన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాలజాతి మొత్తం ఒక వేదికపైకి వచ్చి ఐక్యత చాటారని పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్‌‌లో నిర్వహించిన మాలల భవిష్యత్ కార్యాచరణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 

జాతిలో స్ఫూర్తి నింపిన సింహగర్జన సక్సెస్‌‌ ఆరంభం మాత్రమేనన్నారు. తెలంగాణలో అతిపెద్ద రెండవ కులం మాలలేనని సింహగర్జన సభ నిరూపించిందని తెలిపారు. మాల జాతికి దక్కాల్సిన వాటా లభించేదాకా కొట్లాడుతామని స్పష్టం చేశారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన 540 పేజీల జడ్జిమెంట్‌‌లో ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని, అందుకోసం త్వరలో రౌండ్ టేబుల్ మీటింగ్‌‌లు పెడతామని తెలిపారు. 

కుల వివక్షపై జడ్జిమెంట్‌‌లో ఒక్కపాయింట్ కూడా లేదన్నారు. ఎస్సీ వర్గాల్లో ఉద్యోగాలు రాని వారికి ప్రయారిటీ ఇవ్వాలని మాత్రమే చెప్పిందని, సంఖ్య బలాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా ఆదేశించలేదన్న విషయం గమనించాలన్నారు. బలంగా మారిన మాల జాతి బలహీనం కావొద్దని ఆయన సూచించారు. 75 వేల మందికి గుడిసెలు, 40 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన తన తండ్రి కాకా వెంకటస్వామి జాతి వివక్ష ఎక్కడా చూపలేదన్నారు. 

బేషజాలకు పోవద్దు..

జాతి ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో బేషజాలకు పోవద్దని, కుర్చీల కోసం పాకులాడొద్దని, అవసరమైతే త్యాగాలకు రెడీగా ఉండాలని వివేక్‌‌ వెంకటస్వామని పిలుపునిచ్చారు. మాల ఉద్యోగుల సమస్యలు తమకు తెలుసని, ప్రయారిటీ లేని పోస్టింగ్‌‌లు ఇచ్చి అణిచి వేస్తున్నారని ఆరోపించారు. ఐక్యతతో ఉంటే అంతా భయపడతారని, అందరి కంటే ఎక్కువ సమయం పనిచేసి ‘హమ్ కిసేసి కమ్ నహీ’అని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణ కోసం జిల్లాల వారీగా జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 తనకు పదవులు ముఖ్యం కాదని, మాల జాతి అండతో వారి శ్రేయస్సు కోసమే పనిచేస్తానని వివేక్‌‌ స్పష్టం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. మాల సమాజాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకొని వదిలేశాయని మండిపడ్డారు. ఏండ్ల తరబడి రాజకీయాల్లో విపరీతమైన వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, స్టేట్ ఫార్మర్స్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సర్వయ్య, వెంకట్, సత్యనారాయణ, బాలరాజ్, జిల్లా మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆలుక కిషన్, బోధన్ మాజీ మున్సిపల్​చైర్మన్ ఎల్లమయ్య తదితరులు ఉన్నారు.

దళితులను బలహీనపర్చాలని చూస్తున్నరు

కొందరు తమ స్వార్థం కోసం దళితులను బలహీన పర్చాలని చూస్తున్నారని, ఈ క్రమంలో మాలలు ఐక్యంగా ఉండి పోరాడితే నే తమ హక్కులను సాధించగలు గుతారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదిలాబాద్‌‌‌‌ టౌన్‌‌‌‌లోని న్యూ హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించిన మాల సంక్షేమ సంఘ భవనం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన మాలల భవిష్యత్​  కార్యాచరణ, జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీ కులాలను విభజిస్తే భవి ష్యత్‌‌‌‌లో వారి రిజర్వేషన్లు పూర్తిగా తొలగి పోయే ప్రమాదముందని ఆర్టికల్ 341లో పొందుపర్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొందరు నాయకులు రాజకీయాలు చేశారని, కానీ తానెప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోలేదని స్పష్టం చేశారు. మాలలపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని​ఖబర్దార్‌‌‌‌‌‌‌‌ మందకృష్ణ మాదిగ అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్‌‌‌‌, ప్రధాన కార్యదర్శి బి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.