చెన్నూర్ చెరువు మత్తడిని పేల్చేసిన దుండగులు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్​ ఆఫీసర్లు
  • తాత్కాలిక రిపేర్లకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలు

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడిని గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేశారు. సుమారు 100 ఎకరాల ఆయకట్టు గల చెరువు ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండలా మారింది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చెరువు మత్తడి కాంక్రీట్​నిర్మాణాన్ని 15 నుంచి 20 మీటర్ల మేర డిటోనేటర్లతో పేల్చి ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీరు వృథాగా పోయింది. మంగళవారం ఉదయం చెరువు మత్తడి పేల్చేసిన విషయాన్ని స్థానిక కాంగ్రెస్​ లీడర్ల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలుసుకున్నారు. 

తర్వాత ఇరిగేషన్ ఈఈ విష్ణుప్రసాద్, డీఈ వేణుగోపాల్​తో ఫోన్​లో మాట్లాడారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. పేల్చివేసిన మత్తడిపై ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక రిపేర్లు చేపట్టనున్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు పేర్కొన్నారు. మత్తడి ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆఫీసర్లు ఫిర్యాదు చేశారు. ఆయకట్టు రైతులకు నష్టం చేసేందుకు దుండగులు ఉద్దేశ్యపూర్వకంగా పేల్చివేశారా.. నేషనల్​ హైవే 63ను ఆనుకొని ఉన్న చెరువు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉండడంతో.. చెరువు నిండా ఉన్న నీళ్లను బయటకు పంపించేందుకు పేల్చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అలాగే రాజకీయంగా, సామాజికంగా విభేధాలు సృష్టించేందుకు ఎవరైనా ఇలా చేశారా అనే దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్నదని మత్తడి ధ్వంసం చేసిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని టౌన్ సీఐ రవిందర్ తెలిపారు.