ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం

  •     పదేండ్ల సమస్య పరిష్కారమయ్యిందన్న కాలనీవాసులు

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డు మారుతీనగర్​లో తాగునీరు, కరెంట్ సౌలత్​లు కల్పించేందుకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవచూపారని వారి ఫొటోలకు కాలనీవాసులు క్షీరాభిషేకం చేశారు. సోమవారం కాంగ్రెస్​ సీనియర్​ లీడర్, అఖిలభారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ ​బండి సదానందం యాదవ్​ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

మారుతీనగర్​లో పదేండ్లుగా తాగునీరు, కరెంట్ సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, గత బీఆర్ఎస్​పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కాలనీకి వచ్చిన వివేక్​ వెంకటస్వామి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వివేక్​తోపాటు ఎంపీ వంశీకృష్ణ సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడంతో కాలనీలో తాగునీరు, కొత్త లైన్లు వేసి కరంటు సౌలత్​లు కల్పించారని పేర్కొన్నారు. వారికి రుణపడి ఉంటామన్నారు. లీడర్లు పెద్ది రాజు, మల్లెత్తుల నరేశ్, పెద్దిరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు.