- విద్యుత్తు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లా
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- పలు అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన
కోల్‌బెల్ట్/జైపూర్/చెన్నూర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలన చెన్నూరు నియోజకవర్గంలో కరెంటు అవసరాలను తీర్చలేదని, నిరంతరాయంగా విద్యుత్తు సప్లైకు కొత్తగా మరిన్ని సబ్స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. జైపూర్ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ.10 లక్షలతో కొత్త ఎంపీపీ భవనం, భీమారం మండలం నర్సింగాపూర్‌లో రూ.1.60 కోట్లతో 5 కేవీఏ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరాలో లోపాలు రాకుండా చూసేందుకు కెపాసిటీని పెంచాల్సి ఉందన్నారు.
ఇటీవల విద్యుత్తు అధికారులతో సమస్యపై రివ్యూ చేసినట్లు తెలిపారు. ట్రాన్స్‌కో సీఎండీ వరుణ్‌రెడ్డిని ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి సమస్య పరిష్కారం కోసం మాట్లాడినట్లు చెప్పారు. రెండేండ్లుగా విద్యుత్వినియోగం పెరిగిందని సీఎండీ తమ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. నర్సింగాపూర్‌లో సబ్‌స్టేషన్‌తో పాటు త్వరలో మరో 5 కేవీఏ కెపాసిటీ సబ్ స్టేషన్‌ను చెన్నూరులో ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సమస్య తీర్చాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఇందారంలో 33 కేవీఏ విద్యుత్‌సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
హైవే రిపేర్లు పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ..
భీమారం మండలం జోడువాగుల వద్ద జాతీయ రహదారి రిపేర్ పనులను ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ కలిసి పరిశీలించారు. నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం చెన్నూరు బస్టాండ్ ఏరియాలో టీస్టాల్‌ను ప్రారంభించారు. అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గడ్డం రాములు ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మున్సిపల్, ఫారెస్ట్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారిగా జైపూర్ మండలానికి వచ్చిన గడ్డం వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. డీఆర్డీవో కిషన్, జైపూర్ఏసీపీ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు ఎమ్మెల్యే ఓదార్పు
చెన్నూరు హైవేపై శుక్రవారం రాత్రి బైక్ ను బొలెరో వాహనం ఢీకొనడంతో మండలంలోని దుగ్నేపల్లికి చెందిన పర్వతాలు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి ఓదెలుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అప్పటికే మున్సిపల్ వార్డుల్లో బైక్‌పై పర్యటిస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. దగ్గరుండి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.