బాసర ట్రీపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఆరా : ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

బాసర, వెలుగు: బాసర ట్రీపుల్ ఐటీని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవలే  త్రిబుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బాసర త్రిబుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, సమస్యలుంటే తనకు నేరుగా కాల్ చేయవచ్చని సూచించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసి, త్రిబుల్ ఐటీలో  బోధన, క్రీడా, ఇతరత సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ తో సమావేశమయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు అందుతున్న ప్లేస్మెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. త్రిబుల్ ఐటీ అధ్యాపకులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు, నాయకులు వెంగల్ రావు  తదితరులున్నారు.