ఆగస్టు 15 లోపే రుణమాఫీ : మైనంపల్లి రోహిత్

చిన్నశంకరంపేట, వెలుగు: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపే రుణమాఫీ చేసి తీరుతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు​ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర కొత్త భవనాన్ని  ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  

మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు.  వచ్చే నెల 4 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల కాలపరిమితి ముగుస్తుండడంతో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలను  శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ  సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ శాఖ సంచాలకులు విజయనిర్మల, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, వైస్ చైర్మన్ నగేశ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమన్ రెడ్డి, రాజి రెడ్డి, రంగారావు, యాదవ రావు, యాదగిరి, ఎంపీడీవో దామోదర్, తహసీల్దార్ మన్నన్, ఇన్​చార్జి ఎంఈవో బుచ్యా నాయక్ పాల్గొన్నారు.