డ్యూటీలో లేని డాక్టర్లపై చర్యలు తీసుకోండి : మానిక్ రావు

జహీరాబాద్, వెలుగు: ప్రభుత్వ డాక్టర్లు కచ్చితంగా సమయపాలన పాటించి, రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే మానిక్ రావు ఆదేశించారు. జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. ఎమ్మెల్యే విజిటింగ్ సమయంలో పలువురు డాక్టర్లు గైర్హాజరు కావడం, మరికొందరు లీవ్​లో ఉండండంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 24 గంటలు డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్​ను ఆదేశించారు. 

డ్యూటీ టైమ్ లో విధుల్లో లేని వారితోపాటు అనధికారికంగా లీవ్ పెట్టిన వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఫోన్​లో  కోరారు. అనంతరం ఐసీయూ, డయాలసిస్ సెంటర్లను సందర్శించి రోగులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరా సంగం మండల అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్లు చందు, తాంజిమ్ తదితరులు పాల్గొన్నారు.