- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే జీఎంఆర్ వినతి
పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు పట్టణంలో జనావాసాల మధ్య ఉన్న ప్రభుత్వ హెచ్ పీ గ్యాస్ గోదాంను వేరే ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అయ్యారు. పాత తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆఫీసు ఏర్పాటు కాబోతోందని, నిత్యం వందలాదిమంది రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తారు కాబట్టి మండల పరిధిలోని రామేశ్వరం బండ శివారులో గ్యాస్ గోదాంకి స్థలాన్ని కేటాయించి తరలించాలని మంత్రిని కోరారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సూచనల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. పట్టణంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.