గ్రామ పంచాయతీలకు నిధులేవీ : కొత్త ప్రభాకర్​రెడ్డి

దుబ్బాక, వెలుగు: గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎనిమిది నెలలుగా నిధులను విడుదల చేయకపోవడంతో పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసులో ఆయన 300 మందికి రూ. 80 లక్షల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత రోడ్లు రిపేర్​చేయకపోవడంతో ప్రజలు రోడ్ల మీద నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. మాజీ సర్పంచ్​లు, ఎంసీటీసీలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే వారికి బిల్లులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. గోదావరి నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

 కాళేశ్వరం ద్వారా రంగనాయక, మల్లన్న సాగర్​, కొండపోచమ్మ సాగర్లను నింపి పంట పొలాలకు నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ ద్వారా కూడవెళ్లి వాగుకు, ఇతర కాల్వలకు వెంటనే సాగు నీరందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్​చైర్​పర్సన్​వనిత, పీఏసీఎస్​చైర్మన్​హరి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్​నాయకులు రాజమౌలి, రవీందర్​ రెడ్డి, లింగం, శ్రీనివాస్​, రవి, సత్యనారాయణ, బాలకిషన్​గౌడ్​పాల్గొన్నారు.