సన్నాల పేరుతో మోసం : హరీశ్‌ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు మండిపడ్డారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతుల తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. రూపాయికి 95 శాతం దొడ్డువడ్లు పండించే వాళ్లకు బోనస్ ఎగ్గొట్టి  కేవలం 5 శాతం సన్నవడ్లు పండించే వాళ్లకు బోనస్ ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇంటి అవసరాలకు మాత్రమే సన్న వడ్లు పండిస్తారని మిగతా వడ్లన్నీ దొడ్డువడ్లే అన్నారు. సిద్దిపేట జిల్లాలో 3,38,389 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో 3, 29, 000 వేల ఎకరాల్లో దొడ్డు రకం వేశారని కేవలం16 వేల ఎకరాల్లో మాత్రమే సన్నరకం వేశారన్నారు.

వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు. కొనుగోళ్లు కేంద్రాల్లో ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయని తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. అనంతరం నంగునూర్ మండల కేంద్రానికి చెందిన సుంచన కోట యాదగిరి ఇటీవల నీట మునిగి చనిపోగా పార్టీ ఇన్సూరెన్స్ రూ.2 లక్షల చెక్ ను భార్య మాధవికి  అందజేశారు.