దుబ్బాక, వెలుగు: ‘కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. రైతుబంధు లేదు. సాగు, తాగు నీరు లేదు. వంటలమ్మలకు బిల్లులు ఇవ్వట్లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలివ్వలేని దుస్థితి. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. కరువొచ్చినా కనికరించటోడు లేడు. మొత్తంగా కాంగ్రెస్ పాలనంతా ఆగమాగం ఉంది’ అని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం దుబ్బాకలో పదవీ విరమణ పొందుతున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అథితిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అవస్థలు పడుతున్నారని, పంచాయతీ కార్మికులకు జీతాలు లేవని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించలేని స్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు.
పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ. 4 వేలు చేస్తామని, రైతుబంధును రూ.5 వేల నుంచి రూ.ఏడున్నర వేలకు పెంచుతామని నమ్మబలికి కాంగ్రెస్ఓట్లేసుకుందన్నారు. అయితే, పెట్టుబడి సాయం రాక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం కరెంట్ఎప్పుడు పోతుందో ఎప్పుడొస్తుందో తెలియడం లేదని, దీనికి ఉద్యోగులను బాధ్యులను చేస్తూ వేధిస్తోందని ఆరోపించారు. మానభంగాలు, మర్డర్లు పెరిగిపోయాయని, లా అండ్ ఆర్డర్ ఆగమైపోయిందన్నారు. కేసీఆర్ కిట్టు, సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి చెక్కులను ఏడు నెలలైనా ఇవ్వడంలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌పాలనలో బాయికాడి మోటార్లు కాలిపోలేదని, ఇప్పుడెందుకు కాలుతున్నాయో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని, తెలంగాణ ప్రజలకు రానున్నవి మంచి రోజులేనని, వచ్చేది కేసీఆర్ప్రభుత్వమేనని అన్నారు. ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.