పెట్టుబడి సాయం విడుదల చేయాలి : హరీశ్​రావు 

సిద్దిపేట, వెలుగు: పెట్టుబడి సాయాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు డిమాండ్ చేశారు. ఆదివారం నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  పంట బోనస్ బోగసయ్యిందని,  విత్తనాల కొరత లేకుండా చూడడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ విషయంలో మంత్రులు తలో మాట్లాడుతున్నారని,  అసెంబ్లీలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో 11,268 ఎకరాల్లో  ఆయిల్ ఫామ్ సాగు జరుగుతోందని, ఖమ్మం తర్వాత సిద్దిపేట జిల్లా రెండో  స్థానంలో ఉన్నట్టు తెలిపారు. జీలుగ విత్తనాల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు.