బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీరు అందిస్తాం : గడ్డం వినోద్

  • రూ.61.50 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్​ 

బెల్లంపల్లి, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బెల్లంపల్లి పట్టణ ప్రజలకు 11 నెలల్లో గోదావరి తాగునీరు అందించేందుకు రూ.61.50 కోట్లతో అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభమైంది. మంగళవారం బెల్లం పల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద చేపట్టిన అమృత్ 2.0 పథకానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలె క్టర్ కుమార్ దీపక్ భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు సురక్షితమైన నీరు అందక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంజూరు చేశామని వివరించారు.

 పనులను వేగవంతం చేసి 11 నెలల్లోగా ప్రజలకు గోదావరి తాగు నీరు అందించాలని కాంట్రాక్టర్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్, ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నేతలు మునిమంద రమేశ్, దావ రమేశ్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, చిలుముల శంకర్, బండి ప్రభాకర్ యాదవ్, అధికారులు, నేతలు పాల్గొన్నారు.