బెల్లంపల్లి రూరల్/బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. సోమవారం నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాల్లో కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గం వెనుకబడిపోయిందని.. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందవద్దని, వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని తప్పకుండా రుణమాఫీ అయ్యేలా చూస్తానన్నారు. ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు రమేశ్, శ్రావణ్‌కుమార్, ఎంపీడీఓలు గంగామోహన్, దేవేందర్‌రెడ్డి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు గట్టు మల్లేశ్, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లంపల్లి గోదావరి రక్షిత పథకం పరిశీలన
గోదావరి తాగునీటి పథకం కింద బెల్లంపల్లి పట్టణ ప్రజలకు త్వరలో మంచినీరు సరఫరా చేస్తామని, ఇందుకు అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. సోమవారం మంచిర్యాల మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ముల్కాల పంప్ హౌజ్ ను పరిశీలించారు. అనంతరం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యలు తలెత్తకుండా త్వరగా గోదావరి వాటర్ సప్లయ్ చేయాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ డీఈ మధుకర్, షోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.