కంది, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నియోజకవర్గంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వానకాలం దృష్టిలో ఉంచుకొని నక్కవాగుపై చెక్ డ్యాంలు, మల్కాపూర్ పెద్ద చెరువుపై మరమ్మతులు చేయాలని సూచించారు.
చెరువు శిఖం, నాలా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సింగూర్ రైట్ కెనాల్ ను పెద్దాపూర్ వరకు పొడిగించాలని సంబంధిత శాఖ అధికారులను కోరారు. నియోజకవర్గంలో మొత్తం 21 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా అందులో ఆరు దవాఖానాల పనులు ప్రారంభమయ్యాయని, మరో ఐదు బస్తి దవాఖానాల కోసం స్థలం చూస్తున్నట్లు ఎమ్మెల్యే కు అధికారులు వివరించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతి, సంగారెడ్డి ఐబీ నుంచి బైపాస్ బసవేశ్వర విగ్రహం వరకు ఫోర్ లైన్ రోడ్, రాజంపేట రోడ్డు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీఆర్డిప్యూటీ ఈఈ దీపక్, ఐఆర్ఆర్ఐ డిప్యూటీ డీఈ బాల గణేశ్, ఆర్అండ్ బీ డిప్యూటీ ఈఈ రవీందర్, శశాంక్, కొండల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, గోవర్ధన్ నాయక్, శ్రీనివాస్, విఠల్ పాల్గొన్నారు.