ఉట్నూర్, వెలుగు: నియోజకవర్గంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను నేరుగా వారి నుంచి తెలుసుకొని వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
పలు మండలాల గ్రామాలకు చెందిన వారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడి స్థానిక సమస్యలను వివరించారు. నీరు, రోడ్డు, డ్రైనేజీ, కరెంట్, భూమి పట్టాలు, అటవీ భూములకు హక్కు పత్రాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన ఘనత కాంగ్రెస్ప్రభుత్వానిది అన్నారు.