పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

కడెం, వెలుగు : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం త్వరలో రూ.లక్షతోపాటు తులం బంగారం అందజేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులను సకాలంలో బ్యాంకులో జమ చేసి విత్ డ్రా చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.9.21 కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. మరోవైపు సదర్మాట్ కెనాల్ ను పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం కడెం హరిత రిస్టార్ట్ లో నిర్వహించిన మంత్రి ధనసరి సీతక్క జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్​ సుజాత, మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్ శైలజ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా యూత్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.