కేసీఆర్ ఫొటో ఉందని చెక్కులు ఆపిండ్రు : అనిల్ జాదవ్ 

నేరడిగొండ, వెలుగు: సీఎంఆర్ఎఫ్ చెక్కులపై కేసీఆర్ ఫొటో ఉందని ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్​కు సంబంధించి 123 మంది లబ్ధిదారులకు మంగళవారం ఆయన చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల హాస్పిటల్ ఖర్చులను మాజీ సీఎం కేసీఆర్ ఏనాడూ ఆపలేదని, రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చినా చెక్కులపై కేసీఆర్ ఫొటో ఉందని వేల సంఖ్యలో చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి ఆపారని ఆరోపించారు. ఆపదలో ఉన్న పేద ప్రజల హాస్పిటల్ ఖర్చుల డబ్బులపై కూడా రేవంత్ రెడ్డి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, మండల కన్వీనర్లు అల్లూరి శివారెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ తదితరులు పాల్గొన్నారు.