మంచిర్యాల జిల్లాలో వివాదాస్పదంగా మిషన్​ భగీరథ పైపులైన్​

 

  • హైకోర్టుకు తప్పుడు రిపోర్ట్​ ఇచ్చిన అధికారులు
  • 249 సర్వేనంబర్​నుంచి తొలగించాలంటున్న బాధితులు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాల్​వాడ లోని 249 సర్వేనంబర్​నుంచి మిషన్​ భగీరథ పైపులైన్​నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ఆరేండ్ల క్రితం అప్పటి అధికారులు చేసిన తప్పు ఇప్పుడు తలనొప్పిగా మారింది. బాధితుడు చుంచు శ్రీనివాస్​ తెలిపిన వివరాల ప్రకారం.. 2012 మున్సిపల్​మాస్టర్​ప్లాన్​లో లక్ష్మీ టాకీస్​నుంచి గోపాల్​వాడ, తిలక్​నగర్​మీదుగా సున్నంబట్టివాడ మెయిన్​రోడ్డు వరకు 100 ఫీట్ల రోడ్డును ప్రతిపాదించారు. 2018లో మిషన్​భగీరథ పైపులైన్​ఈ మాస్టర్​ ప్లాన్​రోడ్డు నుంచి వేయాల్సి ఉండగా అప్పటి అధికారులు దానిపక్కనున్న 249 సర్వే నంబర్ నుంచి వేశారు.

భూయజమానులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని పోలీసులతో నిర్బంధించి పైపులైన్​ నిర్మాణం పూర్తి చేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా పైపులైన్​ప్లాన్ సమర్పించాలని ఆదేశించింది. దీంతో 249 సర్వే నంబర్​నుంచి పైపులైన్​వేయలేదంటూ మిషన్​భగీరథ అధికారులు కోర్టుకు తప్పుడు రిపోర్టులు అందజేశారు. దీంతో భూయజమానులు రెవెన్యూ అధికారులతో సర్వే చేయించగా 249 సర్వేనంబర్​నుంచే వేసినట్టుగా తేలింది. ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకొని భగీరథ పైపులైన్​ను తమ భూమి నుంచి తొలగించాలని కోరుతున్నారు. లేదంటే ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. అప్పటి మున్సిపల్​పాలకవర్గంలోని కీలక వ్యక్తుల భూములను కాపాడేందుకు భగీరథ అధికారులు పైపులైన్​ను దారిమళ్లించి అడ్డంగా ఇరుక్కుపోయారు.