- అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం: శ్రీధర్‌బాబు
- ప్రజలకు ఉపయోగపడేలా ప్రాజెక్టులు కడతాం: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
- రూ. 12.10 కోట్లతో మంథనిలో మంచినీటి పథకం
- పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీ శంకుస్థాపన
పెద్దపల్లి/ మంథని/ రామగిరి, వెలుగు: ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, పిచ్చి కూతలు కూసినా పట్టించుకోబోమని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి పర్యటించారు.
మంథని పట్టణంలో అమృత్ స్కీం కింద రూ. 12.10 కోట్లతో మంచినీటి పథకానికి, రూ. 4.16 కోట్లతో రామగిరి మండలం రత్నాపూర్లో విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. రామగిరిలో కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన బిల్డింగ్‌ను ఓపెన్ చేశారు. మంథని గురుకుల పాఠశాలలో జరిగిన వనమహోత్సవంలో పాల్గొని, మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తాము ఇచ్చిన మాట ప్రకారమే.. మంథనిలో అమృత్ స్కీం కింద రూ.12.10 కోట్లతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశామని అన్నారు. ]
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 38 కోట్లతో మంథని పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. మంథని, చెన్నూరు మార్గంలో బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు, గృహ అవసరాలకు, పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సప్లయ్ జరుగుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన పారదర్శకంగా సాగుతున్నదని, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీధర్‌బాబు చెప్పారు.
అవసరాలకు తగ్గట్టు విద్యుత్ సరఫరా: వంశీ కృష్ణ
పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు విద్యుత్‌సరఫరా చేసేందుకు వీలుగా సబ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజలందరికీ మౌలికసదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ఎలాంటి ప్రణాళిక లేకుండా మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను చేపట్టి, ప్రజాధనాన్ని దోచుకుందని విమర్శించారు.
ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, రాబోయే రోజుల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని ప్రాజెక్టులను కట్టి తీరుతామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టడంతోపాటు లోతైన పరిశీలన జరిపి, పూర్తి చేయడం మంత్రి శ్రీధర్ బాబుకే సాధ్యమని పేర్కొన్నారు. ఆయనను చూసి ప్రజాసేవలో తాను ఎంతో నేర్చుకుంటున్నానని వంశీకృష్ణ చెప్పారు. వారి వెంట జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.