అధికారులు సెలవులు తీసుకోవద్దు..

  •  ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలి
  •  కడెం ప్రాజెక్టు ను సందర్శించిన  మంత్రి శ్రీధర్ బాబు...

నిర్మల్, వెలుగు :  జిల్లాలో  వర్షాల కారణంగా  ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు    చర్యలు చేపట్టాలని   మంత్రి శ్రీధర్ బాబు  ఆదేశించారు. సోమవారం రాత్రి  కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు తో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో  అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ప్రాజెక్టు  ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను  తెలుసుకున్నారు.  శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

 ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి మండలాలలో అధిక వర్షపాతం నమోదు అయిందని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్​చేయాలని  సూచించారు. రూ. 10 కోట్లతో కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు జరిపించామన్నారు.  వరదల కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా చూడాలని కోరారు. అధికారులు సెలవులు తీసుకోకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని సూచించారు. ముఖ్యంగా ప్రత్యేక అధికారులంతా వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు.


ఎంసీహెచ్​ క్లోజ్​..

మంచిర్యాల, వెలుగు : గోదావరి ఒడ్డున ఉన్న ఎంసీహెచ్​కు వరద ముప్పు పొంచివుండడంతో అధికారులు ముందుజాగ్రత్తగా పేషెంట్లను జీజీహెచ్​కు తరలించారు. అనంతరం ఎంసీహెచ్​కు తాళం వేశారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు, కలెక్టర్​ కుమార్​ దీపక్​ ఎంసీహెచ్​ను సందర్శించారు.