ఆదిలాబాద్/ నిర్మల్/నస్పూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించారు. పెన్ గంగా వరద ఉధృతి, సిమెంట్ ఫ్యాక్టరీ, ఐటీ టవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం పెన్ గంగా నది వరద ఉధృతిపై, పంట నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టుల్లోకి వరద అధికంగా వస్తున్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్త నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ మెషీన్లు, క్వార్టర్లను మంత్రి పరిశీలించి అక్కడున్న జీఎంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ పునరుద్ధరణ అంశంపై పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.
ఈ అంశంపై కేంద్రం సానుకూలంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే, స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల తీరును ప్రాజెక్ట్ ఇంజనీర్ ను అడిగి తెలుసుకున్నారు.
జీఎన్ఆర్ కాలనీ ప్రజలను ఆదుకుంటాం
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మల్టౌన్లోని జీఎన్ఆర్ కాలనీ ప్రజలను ఆదుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి ఆ కాలనీని సందర్శించారు. స్వర్ణ ప్రాజెక్టు కింద చెక్ డ్యామ్ నిర్మాణం, స్థానికంగా ఉన్న నాలాల ఆక్రమణ కారణంగా వరద నీరు సక్రమంగా ప్రవహించక నీరు కాలనీలోకి చేరుతుందని స్థానికులు మంత్రికి తెలిపారు. చెక్ డ్యామ్ నిర్మాణాన్ని కుదించి, నాలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి వరద నీటిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాలనీవాసుల సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి సాంకేతిక నిపుణులతో చర్చించి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జీఎన్ఆర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటిని విడుదల చేయాలి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరదనీటిని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దిగువకు విడుదల చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఇరిగేషన్అధికారులను ఆదేశించారు. మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటిని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, అత్యవసర సేవల కోసం ప్రజలు వాటిని సంప్రదించాలని సూచించారు.