మహిళలను కోటీశ్వరులను చేస్తం: శ్రీధర్ బాబు

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు, ఎంపీ వంశీకృష్ణ
  • మంథనిలో ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వచ్ఛ ఆటోల పంపిణీ
  • మహిళా స్వశక్తి సంఘాలకురూ. 20.67 కోట్ల చెక్కు పంపిణీ
  • డయాలసిస్ సెంటర్ ప్రారంభం
  • మాట ఇచ్చినట్లుగానే రైతులకు రుణమాఫీ చేశాం
  • సాంకేతిక సమస్యలతో ఆగిన వాటిని క్లియర్ చేస్తమని వెల్లడి

పెద్దపల్లి/ మంథని/ గోదావరిఖని, వెలుగు: రానున్న రోజుల్లో మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మాట ఇచ్చినట్లుగానే రైతులకు రుణమాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం నిర్వహించిన వివిధ 
అభివృద్ధి పనులను మంత్రి, ఎంపీ ప్రారంభించారు. మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్టు డాక్డర్ మంజూషతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. మహదేవపూర్​లోని డయాలసిస్ సెంటర్ పనితీరును మంత్రి, ఎంపీలు వీసీలో అడిగి తెలుసుకున్నారు. మంథని పట్టణంలో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మహిళాశక్తి ద్వారా స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. మహిళా స్వశక్తి సంఘాలకు రూ.20.67 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వశక్తి గ్రూపులను ఆదుకుంటామని చెప్పినట్లుగానే  వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్తామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడంతో పాటు. పది మందిని ఆదుకునే స్థాయికి వారిని తీసుకెళ్తామన్నారు. 

మోడల్ సిటీగా రామగుండం: శ్రీధర్​బాబు 

రామగుండంను మోడల్​ సిటిగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. సింగరేణి ఆర్జీ1 ఏరియా పరిధిలోని జీడీకే ఓపెన్​కాస్ట్5 కోసం నిర్మించిన సైట్ ఆఫీస్​ను, రామగుండంలోని లక్ష్మినగర్, కల్యాణ్​నగర్, అడ్డగుంటపల్లి, మేదరిబస్తి  ఏరియాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ కోసం టీయూఎఫ్ ఐడీసీకి చెందిన రూ.20.50 కోట్ల పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రామగుండాన్ని మోడల్​ సిటీగా మార్చడానికి  కన్సల్టెంట్​ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనాభాకు తగ్గట్టుగా తాగునీరు, రోడ్ల విస్తరణ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలని, ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హెచ్చరించారు. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల సింగపూర్ సంస్థను సంప్రదించామన్నారు. వచ్చే అక్టోబర్​లో ‘రూరల్ టెక్నాలజీ సెంటర్’ను ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆ సంస్థ అంగీకరించిందని మంత్రి చెప్పారు. రామగుండంలో మూసివేసిన జెన్​కో ప్లాంట్ స్థానంలో ఆ సంస్థ ద్వారా గానీ, సింగరేణి సంస్థ ద్వారా గానీ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తామన్నారు.

అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ దే

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఇప్పటికీ చాలా మందికి తాగునీరు అందడం లేదన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అంతకు మించి డెవలప్​మెంట్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. సభలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ, మేయర్ అనిల్ కుమార్, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షులు వి.సీతారామయ్య, సింగరేణి డైరెక్టర్ ఎన్​వీకే శ్రీనివాస్, ఆర్జీ 1 జీఎం డి.లలిత్ కుమార్, బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేసి చూపిస్తం: వంశీకృష్ణ

ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పేద పేషెంట్లు డయాలసిస్ చేయించుకోలేక బాధపడుతున్నారన్నారు. వారికి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినట్లుగానే చేశామన్నారు. ప్రతి చోట ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. చేపట్టిన ప్రతి పనిని మూడు నెలల్లోనే పూర్తయ్యేలా చూస్తామన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా మహిళ శక్తి ద్వారా స్వచ్ఛ ఆటోలు, మహిళ శక్తికి నిధులు అందజేసి వారికి చేయూత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా,​ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.