మహిళలను కోటీశ్వరులను చేస్తం : మంత్రి సీతక్క

  • జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఆదిలాబాద్/ నేరడిగొండ/బోథ్/జైనూర్/ కడెం, వెలుగు: రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆదిలాబాద్​ జిల్లాలో పర్యటించిన సీతక్క  కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఉట్నూర్ మండలంలోని శంభూగడ నుంచి శివనూర్ వరకు రూ.3.24 కోట్లు, లక్కారం నుంచి చింతగూడ వరకు రూ.8 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. కొత్తగూడెంలో రూ.25 లక్షలతో నిర్మించిన పంచాయతీ వనాన్ని ప్రారంభించారు. శ్యాంపూర్ లో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం కలిసి రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

124 స్వయం సహాయక సంఘాల కు రూ.7.59 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులు అందజేశారు. అనంతరం ఐసీడీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రాసన, సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతక్క మాట్లాడుతూ.. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా 17 రకాల వ్యాపారాలను గుర్తించామని పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా హైదరాబాద్ శిల్పారామంలో షాపులను కేటాయించినట్లు తెలిపారు.

ఇచ్చోడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. చైర్మన్ కొమరం సత్యవతితో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. బోథ్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రేషన్ భవనాన్ని ప్రారంభించారు. కడెం మండలం గంగాపూర్-–ఎర్వ చింతల్ వంతెన రహదారి నిర్మాణానికి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. రహదారి నిర్మాణా నికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 

మంత్రి సీతక్క పర్యటనలో ప్రొటోకాల్ లొల్లి 

నేరడిగొండ మండలం లకంపూర్​లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో న్యూ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమం ఫ్లెక్సీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో వేయలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ మెయిన్​గేట్​కు కట్టిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో వేయలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా కార్యకర్తలు నాయకులకు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. అనంతరం మంత్రి సీతక్కతో అనిల్ జాదవ్ కలిసి పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ 
కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్​లో చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు

జైనూర్ సిర్పూర్ యు మండలాల బీజేపీ, బీఆర్ఎస్​కు చెందిన నాయకులు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. జైనూర్ బీజేపీ మండల ప్రెసిడెంట్ కోట్నాక్ దౌలత్ రావు, బీఆర్ఎస్​కు చెందిన సిర్పూర్ యు మాజీ ఎంపీటీసీ లక్ష్మి, సిర్పూర్ యు, పంగిడి మాజీ సర్పంచ్ లు వీణబాయ్, ఆత్రం జలీమ్ షావ్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్గానికి చెందిన మరికొంత మంది నాయకులు సైతం కాంగ్రెస్​కండువాలు కప్పుకున్నారు.