అన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాం: మంత్రి పొన్నం

కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచామని.. ప్రభుత్వ నిర్ణయంతో ఏడున్నర లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో కరీంనగర్ శర్మనగర్‎లోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి అన్ని రకాల చార్జీలు పెరిగాయి.. కానీ విద్యార్థుల మెస్ కాస్మొటిక్ చార్జీలు పెరగలేదన్నారు. 

కాంగ్రెస్ ప్రజా పాలనలో పేద బడుగు బలహీన వర్గాల చిన్నారులకు మేలు జరిగిందని అన్నారు. వసతి గృహాల అద్దె చెల్లించామని.. మొత్తం 700 హాస్టల్స్ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. భవన యజమానులు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మిగతా బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు చేసేందుకు క్రమశిక్షణతో పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు.