గురుకులాల్లో సమస్యలు రాకుండా చూస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో ఏ సమస్య రాకుండా చూసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని తన క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్​లో జరిగిన ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకోబోతోందన్నారు. ఎమ్మెల్యేలతోపాటు కలెక్టర్లు, డీఈవోలు హాస్టళ్లను తరచు తనిఖీచేస్తూ, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేవిధంగా చూస్తున్నట్టు చెప్పారు. 

విద్యారంగ సమస్యల పరిష్కారానికి రూ.5వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అసౌకర్యాలతో ఉన్న అన్ని విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించి, పక్కా భవనాలను నిర్మిస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో అన్ని గురుకులాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. పిల్లలకు అస్వస్థతగా ఉంటే ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలని, వాళ్లకు ఎప్పటికప్పుడు హైట్, వెయిట్ చెక్ చేసి వివరాలను రికార్డు చేయాలని. హిమోగ్లోబిన్, విటమిన్- డీ లాంటి పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించడంతో పాటు ఆహారం వండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

 గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పరిసరాలు, తరగతి, హాస్టల్ గదు శుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.