బీఆర్​ఎస్​ను బొందపెట్టడం ఖాయం

కొండపాక, కుకూనూర్ పల్లి (వెలుగు): పార్లమెంట్​ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్​ను బొందపెట్టడం ఖాయమని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఆమె మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల కోసం కాకుండా పర్సంటేజీల కోసం బీఆర్ఎస్ పని చేసిందని, తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేసిందన్నారు. ఆడబిడ్డల పుస్తెలు తెంపిన ఘనత కేసీఆర్​కుటుంబానికే దక్కిందన్నారు. ప్రజలకు కష్టం వస్తే ఫామ్​హౌస్​లో పడుకునే కేసీఆర్, ఇప్పుడు బస్సు యాత్రలతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. 

దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రఘునందన్ రావు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మోదీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని అంటున్నారని, అలా చేస్తే మన పిల్లల భవిష్యత్​ ఏమిటని ప్రశ్నించారు. బీసీ బిడ్డ నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మడుపు భూంరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్, జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు మహదేవ్, కొండపాక మాజీ సర్పంచ్ మాధురి, ఎంపీటీసీ సాయి బాబా గౌడ్,  సురేందర్ రావు, శ్రీకాంత్, మల్లికార్జున్, శ్రీనివాస్ పాల్గొన్నారు.