త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం : కొండా సురేఖ

  • కార్నర్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ

తొగుట, దుబ్బాక, వెలుగు: పదేండ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అవినీతికి జైలుకెళ్లడం ఖాయమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో  ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భూ బకాసురుడని, రైతుల పట్ల ఆయనకు ఉన్న చిన్న చూపు పలు సందర్భాల్లో బయటపడిందన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. కత్తి నాటకాలు అడి గెలిచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మళ్లీ నాటకాలకు తెరలేపితే ఇప్పుడు ప్రజలు కాళ్లు విరగ్గొడతారన్నారు. మూడేండ్ల ముందు ఎమ్మెల్యే గా ఉన్న రఘునందన్ రావు ఏం  అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు.

ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ గెలిచిన వెంటనే తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు. 13న నర్సాపూర్ లో జరిగే రాహుల్ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్​ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.