ఇక్కడ బీఆర్ఎస్‌కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ

జగదేవపూర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు  రూ.2 లక్షల రుణమాఫీ హామీని నెరవేరుస్తారని, మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని దౌలాపూర్ లో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. తర్వాత మెదక్​కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 

అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు లేవనెత్తకుండా ఫామ్ హౌస్ లో ఉండి..ఇప్పుడు ఎన్నికలు రాగానే రైతులను కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజార్టీ వచ్చేది కేసీఆర్ ​ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నుంచే అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకి ఓటెయ్యొద్దన్నారు. 

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రంలో బీజేపీకి పడుతుందన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పీఏసీఏస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, హనుమంత, జనార్దన్ రెడ్డి, బంగారురెడ్డి, రమేశ్ గౌడ్, నాయిని యాదగిరి, ధర్మారం మల్లేశం, గాడిపల్లి భాస్కర్, నర్సింహారెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు.