- మల్లన్న సాగర్ రైతుల పక్షాన నిలిచింది మేమే
- మంత్రి దామోదర రాజనర్సింహ
ఝరాసంగం, వెలుగు : జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ఏర్పాటు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అద్భుత ఆలోచన అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో నిర్వహించిన నిమ్జ్ భూ నిర్వాసితుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని మాట్లాడారు. 2017, -2018 సంవత్సరంలో మల్లన్న సాగర్ ముంపు బాధితులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్123 ప్రకారం పరిహారం ఇవ్వాలని చూసిందన్నారు.
ఆ టైంలో కాంగ్రెస్ రైతులకు అండగా నిలిచి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఇక్కడి రైతులు సైతం ఆ జీవో రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కూడా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పిందన్నారు. దీంతో269 మందికి చెందిన 500 ఎకరాలకు రూ.22 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. మిగిలిన1000 మంది లబ్ధిదారుల 900 ఎకరాలకు న్యాయ సలహా తీసుకుని ముందుకుపోతామన్నారు.
నిమ్జ్ ప్రాజెక్ట్ కాస్ట్ రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు అవుతుందని, పరిశ్రమల ఏర్పాటు వల్ల 2.50లక్షల ఉద్యోగాలతో పాటు 1.20 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ప్రాజెక్ట్ అభివృద్ధికి ఇక్కడి యువత పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రభుత్వ పక్షాన యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐటీఐలకు ఆధునిక సాంకేతికతను జోడించి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారని
యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. కలెక్టర్ క్రాంతి, డిప్యూటీ కలెక్టర్లు నాగలక్ష్మి, రవీందర్‌రెడ్డి,ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఆర్డీవో రాజు, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, జడ్పీటీసీ వినీల, ఎంపీపీ దేవదాస్, నాయకులు హన్మంత్‌రావుపాటిల్, ఉజ్వల్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, శంకర్‌పాటిల్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.