విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట : దామోదర్​

  • బడిబాటలో మంత్రి దామోదర్​

రాయికోడ్, వెలుగు: విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్​లోని జడ్పీహెచ్ఎస్​లో బడి బాట కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. తొలుత పాఠశాల ఆవరణలో కలెక్టర్​ వల్లూరి క్రాంతితో కలిసి మొక్కలు నాటారు. ప్రైవేట్​ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెప్పారు. 

ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందు బాబులకు అడ్డాగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్​పర్సన్​ మంజుశ్రీ జైపాల్​రెడ్డి, అడిషినల్​ కలెక్టర్​ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో జ్యోతి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీశ్వర్, ఎంపీపీ మొగులప్ప, జడ్పీటీసీ మల్లికార్జున్​ పాటీల్, హెచ్ఎం అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.