హరీశ్​కు మెదక్​ సవాల్

  •     సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
  •     చెమటోడుస్తున్న ట్రబుల్ షూటర్
  •     పాత మెజార్టీలే టార్గెట్ గా ప్రచారం

సిద్దిపేట, వెలుగు: మెదక్ ఎంపీ స్థానం ఎన్నిక మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావుకు సవాల్​గా మారింది. మెదక్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ  సెగ్మెంట్లలో ఆరింటిని బీఆర్ఎస్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హరీశ్​రావు మెదక్ పార్లమెంట్​సీటును గెలుచుకోవడానికి తీవ్రంగా చెమటోడుస్తున్నారు. మెదక్ బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరు ఖరారు కాగానే ప్రచార బాధ్యతలన్నింటినీ హరీశ్​రావు తన భుజాన వేసుకున్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో నియోజకవర్గ, మండల స్థాయి, సోషల్ మీడియా, యువత, స్టూడెంట్స్​తో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్ని క్రియాశీలకం చేస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ల్లో మద్దతు కోసం మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతల కామెంట్ల పై వీడియోలను ప్రదర్శిస్తూ ప్రెస్ మీట్లలో ప్రసంగిస్తున్నారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన మెజార్టీలే లక్ష్యంగా..  

మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సాధించిన మెజార్టీలే లక్ష్యంగా హరీశ్​రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రత్యేకంగా ఇన్​చార్జిలను నియమించారు. ప్రచార కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా  సిద్దిపేట జిల్లాలోని మూడు సెగ్మెంట్లపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో మొత్తం 5,91,664 ఓట్లతో పాటు 2,05,952 ఓట్ల మెజార్టీ రాగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ సెగ్మెంట్లలో 3,14,755 ఓట్ల తోపాటు 1,80,730 మెజార్టీ వచ్చింది.  దీంతో ఈ మూడు సెగ్మెంట్లలో పట్టు నిలుపుకునేందుకు హరీశ్​రావు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.

రెండింటి ప్రచార బాధ్యతలు

మెదక్ పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్​ రావు కరీంనగర్ పార్లమెంట్​పరిధిలో కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్  బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వీలైన సమయంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ల్లో పాల్గొని మాట్లాడుతున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే పలు మార్లు రోడ్ షోలు నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడంతో ఉదయం, రాత్రి వేళల్లో అభ్యర్థులతో కలసి కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తూనే మధ్యాహ్నం వివిధ వర్గాలతో సమావేశమై మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.