కూరగాయల అంగడి తెలుసు.. పశువుల అంగడి తెలుసు. ఈ గింజల అంగడి ఏంది అనుకుంటున్నరా? అదే మరి ఇక్కడ స్పెషల్, మెదక్ జిల్లా పాపన్నపేటలో ప్రతి బుధవారం జరిగే గింజల అంగడిల అన్ని రకాల పప్పుదినుసులు, చిరుధాన్యాలు దొరకుతయ్. ఈ అంగడి ఇప్పటి నుంచి కాదు నిజాం రాజుల కాలం నుంచి నడుస్తోంది. నిజాం కాలం నాటి సంస్థానాల్లో పాపన్నపేట ఒకటి, హైదరాబాద్ స్టేట్ లో విస్తీర్ణం పరంగా ఇదే అతి పెద్దది.
అప్పట్లో అన్ని ప్రాంతాల్లో అంగళ్లు జరిగేవి కావు. పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే జరిగేవి. పాపన్నపేటలో కూడా ప్రతి బుధవారం పెద్ద అంగడి సాగేది. అయితే.. పాపన్నపేట సంస్థానాదీశుల కాలంలో ఈ అంగట్లో కూరగాయలతోపాటు, పప్పుదినుసులు అమ్మడం మొదలైంది. తర్వాత కొంత కాలానికి రెండు అంగళ్లు వేరు వేరుగా జరపడం మొదలు పెట్టారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇప్పుడు ఈ 'గింజల అంగడి'కి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తైబజార్ వేలం కూడా వేస్తున్నారు. అన్ని రకాల ధాన్యాలు ఈ అంగడిలో కందులు, పెసలు, మినుములు, తొగరు, శెనగలు, షిరిశెనగలు, తైదలు, సాయిజొన్నలు.. ఇలా అన్ని రకాల చిరుధాన్యాలు, పప్పు దినుసులు దొరుకుతాయి. ప్రతి వారం ఇక్కడ క్వింటాళ్ల కొద్దీ పప్పుదినుసుల అమ్మకాలు జరుగుతాయి.
జిల్లాలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాలతోపాటు, సంగారెడ్డి జిల్లాలోని పట్పల్లి, రాయికోడ్, కంగి, కల్హేర్, నారాయణఖేడ్, మసూర్ తదితర మండలాల నుంచి రైతులు తాము పండించిన పప్పుదినుసులను ఇక్కడి తీసుకొచ్చి అమ్ముతుంటారు.
కొందరు వ్యాపారులు ఇక్కడినుంచి పెద్ద మొత్తంలో పప్పుదినుసులు, చిరుధాన్యాలు హోల్ సేల్ ధరకు తీసుకెళ్లి వాళ్ల ప్రాంతాల్లో ప్రజలకు రిటైల్ ధరకు అమ్ముతుంటారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఇక్కడికి వచ్చి కావాల్సిన పప్పులను కొనుక్కెళ్తుంటారు.