- కిష్టారెడ్డిపేట ఈద్గా ముందు నిర్మాణాలపై సర్వే రిపోర్ట్
- కబ్జాదారులపై క్రిమినల్ కేసుకు రెవెన్యూ ఆఫీసర్ల కంప్లైంట్
- సర్వే నంబర్164లో ఆక్రమణలను బయటపెట్టిన "వెలుగు"
- అమీన్పూర్, కిష్టారెడ్డిపేట సర్కారు భూముల పరిరక్షణకు చర్యలు
సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జిల్లా యంత్రాంగం యాక్షన్ స్టార్ట్ చేసింది. సర్కారు భూములను కబ్జా చేసే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట ప్రకారం కాస్త ఆలస్యమైనా ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మండలం కిష్టారెడ్డిపేట పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కిష్టారెడ్డిపేట ఈద్గా ముందు దాదాపు రూ. 20 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ముందుకొచ్చారు.
ప్రభుత్వ సర్వే నంబర్ 164లో అర ఎకరం స్థలాన్ని కబ్జా చేసిన కొంతమంది అక్రమార్కులు పక్కా సర్వే నెంబర్లతో డాక్యుమెంట్లు సృష్టించి రెండేళ్ల కింద నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈ నిర్మాణాలపై వందల ఫిర్యాదులు అందినా ఇన్నాళ్లు పట్టించుకోని అధికారులు కలెక్టర్ ఆదేశాలతో సర్వే చేసి నివేదికలు అందజేశారు. ఈద్గా ముందు ఉన్న స్థలం ప్రభుత్వ సర్వే నెంబర్ 164 లోనిదేనని, అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలేనని గుర్తించిన అధికారులు ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. కిష్టారెడ్డిపేట ఈద్గా ముందు జరుగుతున్న కబ్జాలపై "వెలుగు" దినపత్రిక రాసిన కథనాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. చివరకు అమీన్పూర్ రెవెన్యూ, పంచాయతీ అధికారుల సర్వేలు, సమగ్ర విచారణ తర్వాత నివేదిక పై అధికారులకు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అక్రమార్కుల లీలలు
సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేశారు. కోర్టుకు వెళ్లి అవి అక్రమ నిర్మాణాలు కాదని నమ్మించే ప్రయత్నం చేశారు. అధికారులే తమ భూముల్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని కబ్జాదారులు కంటెమ్ట్ కేసు వేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు సమగ్ర సర్వే రిపోర్టును న్యాయస్థానానికి అందజేశారు. అక్కడితో ఊరుకోకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఎండీ రఫీక్, మధుసూదన్, కల్యాణ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీలకు ఆయా రిపోర్టులు అందజేసి అక్రమార్కులపై యాక్షన్ కు దిగారు.
బీఆర్ఎస్నాయకుల మద్దతుతో రెచ్చిపోయిన రియల్మాఫియా
అమీన్పూర్, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకుల మద్దుతుతో రియల్ మాఫియా రెచ్చిపోయింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు కబ్జాదారుల బాగోతాలు బయటకు వస్తున్నాయి. కిష్టారెడ్డిపేట ఈద్గా ముందు ప్రభుత్వ భూమిని ఆక్రమించిన విషయంలో బీఆర్ఎస్లీడర్లు కీలక పాత్ర వహించినట్టు.. వారి బెదిరింపుల వల్లే తాము ఇంతకాలం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని అధికారులు అంగీకరిస్తున్నారు.
అయితే ఈ ఏడాది జనవరిలో జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రభుత్వ భూముల కబ్జాపై స్పెషల్ ఫోకస్ పెట్టి వాటి పరిరక్షణకు సీరియస్ యాక్షన్ ప్లాన్ చేశారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు పూర్తి స్థాయి నివేదికతో యాక్షన్ లోకి దిగడంతో సర్వే నెంబర్ 164 ఈద్గా ముందు అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికల ఆధారంగా జిల్లా యంత్రాంగం ఒకటి రెండు రోజుల్లో రెవెన్యూ, పోలీస్ సహకారంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు
సర్వే నెంబర్ 164 ఈద్గా వద్ద అక్రమ నిర్మాణాలు జరిగిన విషయం వాస్తవమే. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశాం. అలాగే సదరు కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఒకటి రెండు రోజుల్లో యాక్షన్ లోకి దిగి కబ్జాలను పూర్తిగా తొలగిస్తాం. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటాం.
రాధ, అమీన్పూర్, తహసీల్దార్