ఆగస్టు 15 నుంచి ఈ– ఆఫీస్​

  •  శాఖల పనితీరుపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్ 
  • ఇంటిగ్రేటెడ్​  కలెక్టరేట్ లో ప్లాస్టిక్ నిషేధం

మెదక్, వెలుగు: ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించడంపై  మెదక్​   కలెక్టర్​ రాహుల్​ రాజ్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఆయా    విభాగాల్లో  సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం,  లబ్ధిదారులకు  పథకాలు  అందించడంతోపాటు  శాఖల పనితీరు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  పెండింగ్​ ఫైళ్ల క్లియరెన్స్​ వెంటనే    పూర్తయ్యేలా చర్యలుతీసుకుంటున్నారు. 
 
ఫీల్డ్​ విజిట్​కు ప్రాధాన్యం

ప్రజా వాణి నిర్వహించే సోమవారం తప్ప కలెక్టర్​ రాహుల్​ రాజ్​  మిగతా రోజుల్లో ఫీల్డ్​ విజిట్​కే ప్రాధాన్యం  ఇస్తున్నారు. మండలాల్లో పర్యటిస్తూ ఆకస్మికంగా తహసీల్దార్​ ఆఫీస్​లు, హాస్పిటల్స్​, పీహెచ్​సీలు, కేజీబీవీలు, స్కూల్స్​ను తనిఖీ చేస్తున్నారు. అక్కడ అధికారులు, సిబ్బంది రెగ్యులర్​గా డ్యూటీకి వస్తున్నారా? లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. ఆసుపత్రుల్లో సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకుంటున్నారు. గురుకులాలు, స్కూల్​లలో భోజనం నాణ్యతగా ఉంటుందా లేదా పరిశీలిస్తున్నారు. పర్యటనల సందర్భంగా ఆయా చోట్ల జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. 

జాబ్​ చార్ట్​ పాటించాలి

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారి జాబ్​ చార్ట్​ను పక్కాగా పాటించాలని కలెక్టర్​ ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటన చేసే అధికారులు విధిగా సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటన అధికారులు టూర్లో  డైరీ తప్పనిసరిగా మెయింటేన్​ చేయాలని ఆదేశించారు.   మండల స్పెషల్​ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని  సూచించారు. తాను సోమవారం  మినహా మిగితా అన్ని రోజులు క్షేత్రస్థాయి పర్యటనలోనే ఉంటానని ఏ ఒక్క అధికారి అయిన విధులు పట్ల అలసత్వం వహించినా..  క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్లాస్టిక్​ బాటిల్స్​ బ్యాన్​ 

ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ ను ప్లాస్టిక్ రహితంగా తయారు చేయాలని కలెక్టర్​ నిర్ణయించారు. ప్రభుత్వ అధికారులందరూ గ్లాస్, స్టీల్ వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలని సూచించారు. కలెక్టరేట్ లోని ఫస్ట్ ఫ్లోర్ , సెకండ్ ఫ్లోర్ లో తాగు నీటికోసం వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మీటింగ్​లలో సైతం ప్లాస్టిక్ బాటిళ్ళను నిషేధించాలని సూచించారు. కలెక్టరేట్ లోనే ప్రత్యేక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్యాలయంలో ప్రత్యేకంగా కొనుగోలు చేసిన స్టీల్, గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉంచుకోవాలని వాటి ద్వారా వాటర్ ప్లాంట్ నుంచి నీటిని తీసుకుని వెళ్లి సేవించాలని సూచించారు.

ఫైల్స్​ అన్నీఆన్​ లైన్​లోనే ​

కలెక్టర్ లో ఈ - ఆఫీస్  విధానం అమలు చేయాలని కలెక్టర్​ ఆయా ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ - ఆఫీస్ విధానం ద్వారా అన్ని శాఖల ఫైల్స్ సర్క్యూలేట్ కు ఆగస్టు 15వ తేదీ  డెడ్ లైన్​ గా విధించారు. జులై 3వ తేదీ నుంచి సెలెక్ట్​ చేసిన 16 శాఖలతో ఈ - ఆఫీస్ విధానం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఫైలు ఈ - ఆఫీస్ ద్వారాస్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా నూతన ఫైల్స్ కూడా ఈ ఆఫీస్ ద్వారానే  రావాలనే నిబంధనలు విధించారు.