అధికారం పోయినా అహంకారం తగ్గలేదు : రఘునందన్ రావు 

సిద్దిపేట రూరల్, వెలుగు: అధికారం పోయిన బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని, బీజేపీ మీటింగ్ కు వెళ్తే పింఛన్లను కట్ చేస్తామని బెదిరిస్తున్నారని,  కానీ ప్రజలు వాళ్ల అధికారాన్ని కట్ చేసిన విషయం మరిచిపో యినట్టున్నారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు, రాఘవపూర్ గ్రామాలతోపాటు చిన్నకోడూరు, నారాయణరావుపేట మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రఘునందన్​ రావు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, తాజా సీఎం రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, రేవంత్ రెడ్డి ఒక్క హామీని అమలు చేయకుండా గోబెల్స్​ ప్రచారంలో బిజీగా ఉన్నారని, ఆయనకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ చేయాలన్నారు.

పదేండ్లు మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఎన్నో డిమాండ్ల తర్వాత ఏర్పడ్డ నారాయణరావుపేట మండలానికి ఒక్క ప్రభుత్వ ఆఫీసును కూడా నిర్మించలేదని, కానీ ఆయన క్యాంపు ఆఫీసును, ఫామ్​హౌజ్ ను నెలలో వ్యవధిలోనే కట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలు తప్పిదారి కారుకు ఓటేసినా, చెయ్యికి ఓటేసినా అవి చెరువుల పడ్డట్లే అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రమేశ్ గౌడ్,  మండల అధ్యక్షుడు బాబు, సురేశ్ గౌడ్ పాల్గొన్నారు.